గతానికి స్వాగతం - ‘కళాప్రపూర్ణ’ అవసరాల (వింజమూరి) అనసూయా దేవి
Product details
ఎప్పుడో ఒకప్పుడు స్వీయచరిత్ర రాయాలనుకున్నదాన్ని, ఇలాగ పుస్తకాలు రాశాను. మొదటి పుస్తకం ‘నేనూ-నారచనలూ’ ఏదో ఒక ఆవేశంలో రాయగలిగాను. లేకపోతే, పాటలు పాడుకునే నేనేమిటి, పుస్తకాలు రాయడమేమిటి! అది కూడా 83 సంవత్సరాల వయసులో. తీరా ఆరంభించాక, పుల్ స్టాప్ పెట్టినట్టనిపించలేదు. కామా పెట్టినట్టుండి, మళ్లా కంటిన్యూ చేయడం మొదలు పెట్టాను. రెండవ పుస్తకం ‘గతానికి స్వాగతం’ తయారైంది. ఈ పుస్తకం రాస్తున్నప్పుడు నా వయస్సు 86 సంవత్సరాలు. ఉత్సాహం తప్ప ఓపిక లేదు. రాయాలన్న తపన తప్ప, చేతివేళ్ళల్లో పట్టు లేదు. పదినిమిషాలు రాస్తే చేతి వేళ్ళు తిమ్మిరెక్కి, పదినిమిషాలు రెస్టు తీసుకోవాలి. ఈ వయస్సులో మరపు రావడానికి అవకాశం ఉంది. అది వచ్చేముందే జ్ఞాపకమున్న విషయాలన్నీ రాయాలని ఆసక్తి. 86 ఏళ్లకి ఈ మాత్రం ఉన్నాననే ధైర్యం తప్ప, ఆరోగ్యం కూడా సన్నగిల్లుతోంది. ఇటువంటి పరిస్థితులలో రాసిన ఈ పుస్తకము ఎలాగ వచ్చిందో తెలియదుకాని, జీవితంలో నేను చేద్దామనుకున్న ఒక పని పూర్తిచేశానని ఆనందంగా ఉంది.
స్వీయచరిత్ర రాస్తే చాలా నిజాలు రాయాలి. అవన్నీ రాయాలని లేదు అంటే, ఈ పుస్తకం లోనివి నిజాలు కావని కాదు. నా జీవితంలోని జ్ఞాపకం ఉన్న కొన్ని ఘట్టాలు మాత్రమే రాయగలిగాను. ఏమో! భగవంతుడు శక్తిస్తే, ఇంకోపుస్తకంలో అన్నీ రాయగలుగుతానేమో!
- అనసూయ