Indradhanasu - Sri Mandali Venkata Krishnarao - Tejomurthula Venkateswararao
Product details
శ్రీ తేజోమూర్తుల వారి కలం నుంచి ప్రస్తుతం వెలువడిన కావ్యం ‘‘ఇంద్రధనుస్సు’’. తెలుగువారి చిరునామాను అంతర్జాతీయ వేదికల మీద నిలిపిన ‘‘దివిసీమ గాంధీ’’ శ్రీ మండలి వెంకట కృష్ణారావు గారి జీవనయానాన్ని రాజకీయ, సాంఘిక సేవా కార్యక్రమాల్ని దృష్టిలో పెట్టుకొని కవిగారు ‘‘ఇంద్రధనుస్సు’’ కావ్యాన్ని రచించారు. కవిగారు దీనిని ఒక స్మృతి కావ్యంగా పేర్కొన్నారు. ‘ఇంద్రధనుస్సు’ సప్తవర్ణ రంజితం. అలాగే అనేక రంగాలలో మండలి వారి సేవలు వ్యాపించాయి కాబట్టి కవిగారు తాము రచించిన కావ్యానికి ‘ఇంద్రధనుస్సు’ అనే పేరును పెట్టటం ఎంతో సముచితంగా ఉంది.
వ్యక్తి జీవితాన్ని పద్య రూపంలో చిత్రించటం కొంత కష్టమైన పని, కల్పనలకు అవకాశం ఉండదు. వాస్తవ జీవితాన్ని ప్రతిబింబింప చేయాలి. తేజోమూర్తుల వారు సామాజిక వాస్తవికతను పద్య రూపంలో ప్రతిబింబింప జేస్తూ రచనను సాగించిన తీరు ప్రశంసనీయంగా ఉంది.
సహజ ప్రతిభావంతులైన తేజోమూర్తుల వారు విశిష్టమైన శబ్దజాలంతో, భావవైచిత్రితో, ఛందస్సు మీద అధికారంతో ‘ఇంద్రధనుస్సు’ కావ్యాన్ని రచించినట్లు స్పష్టమవుతుంది. భావ విస్తృతిని పద్యంలో బంధించటానికి సీస పద్యం బాగా ఉపకరిస్తుందని కవిగారు నిరూపించారు. శ్రీనాథుడుని తలపింప జేసే రీతిలో సీస పద్యాలు రచించారు. ఇతరమైన ఛందస్సులను కూడా సందర్భానుసారంగా స్వీకరించారు.
తేజోమూర్తుల వారు ఈ కావ్యంలో మండలి వారి వంశ వైశిష్ట్యాన్ని, దివిసీమ వైభవాన్ని, మండలి వారి సంస్కార బలాన్ని, వారిలో ప్రతిబింబించిన జాతీయ భావాల్ని, వారు శాసనసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన తీరును, మంత్రి పదవిని నిర్వహించిన వైనాన్ని, ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణా సామర్ధ్యాన్ని ఇలా ఎన్నో విశేషాల్ని - వివరించారు.