Mottamodhati Jatiya Yuvasahiti Sammelanam 2013
Product details
ఈ ‘మొట్టమొదటి జాతీయ యువ సాహితీ సమ్మేళనం’ ఆలోచనను సూచనప్రాయంగా మేము ప్రస్తావించగానే తక్షణం ఎంతో ఆసక్తితో స్పందించి ఈ అద్వితీయ సమ్మేళనానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సాంస్కృతిక శాఖ సంపూర్ణ సహకారాలను అందించి, కార్యక్రమ రూప కల్పనలో కూడా ఉదాత్తమైన సూచనలను అందించిన ఆత్మీయులు డా॥ రాళ్ళబండి కవితాప్రసాద్ గారికి ఎన్ని సార్లు ధన్యవాదాలు తెలుపుకున్నా అది తక్కువే. ఇక ఈ సమ్మేళన నిర్వహణాభారాన్ని, అవును అది చాలా బరువైన బాధ్యతే..... ఎప్పటి లాగానే తమ భుజస్కంధాలపై వేసుకున్నవారు ‘శిరోమణి’ వంశీ రామరాజుగారు, ఆయన సతీమణి డా॥ తెన్నేటి సుధాదేవిగారు. ఆ దంపతులిద్దరూ అహర్సిశలూ శ్రమించి ఈ మహాసభల ఘనవిజయానికి కారణభూతులయ్యారు. వారి ఆత్మీయతాఋణం నేను ఈ జన్మలో తీర్చుకోలేను. ప్రముఖ రచయిత, విమర్శకులు, వంగూరి ఫౌండేషన్, హైదరాబాదు ఉపాధ్యక్షులు డా॥ ద్వా.నా. శాస్త్రిగారికి నా ధన్యవాదాలు.
ఈ సభావిశేష సంచికలో మొదటి రోజు (సెప్టెంబర్ 29,2013) నుండి ఆఖరి రోజు (అక్టోబర్ 5, 2013) వరకూ యువతరం కవులు, రచయితలు, వక్తలు చదివిన కవితలు, కథలు, వ్యాసాలూ యథాతథంగా ముద్రించబడ్డాయి.
అందరికంటే ముఖ్యంగా, మా ఆశయాలకు, ఆశలకు అనుకోని విధంగా అనూహ్యమైన సంఖ్యలో స్పందించి, ఈ ‘మొట్టమొదటి జాతీయ యువసాహితీ సమ్మేళనం’లో పాల్గొని తమ రచనలను వినిపించి, తమ సాహిత్యాభిమానాన్ని, మాతృభాష మీద ఉన్న మమకారాన్ని చాటుకుని తెలుగు సాహిత్య చరిత్రలో ఒక నూతన అధ్యాయాన్ని సృష్టించిన యువతీయువకులకు నా హార్దిక శుభాశీస్సులు. ప్రత్యక్షంగా ఈ కవితా పఠనాలు, ప్రసంగాలు విన్నప్పుడు యువతకు ఉన్న చిత్తశుద్ధి, సమయపాలన వారి ప్రసంగాంశం మీద ఉన్న పట్టూ, సభా మర్యాద, చర్చావేదికలో నిబద్ధతా ఒక్కటేమిటి అన్ని అంశాలలోనూ ఈ నాటి యువ సాహితీ వేత్తలు స్వయం ప్రకటిత లబ్ద ప్రతిష్టులందరూ ‘సిగ్గు’పడాల్సిన తీరులో అత్యున్నతంగా వ్యవహరించారు. ముఖ్యంగా ‘సభా మర్యాద’ పాటించడంలోనూ, ముందుగా ప్రసంగం తయారు చేసుకోకుండా అప్పటికప్పుడు తోచినది ‘వాగేసి’ పబ్బం గడుపుకునే ప్రముఖ సాహితీవేత్తలు ఈ నాటి యువసాహితీవేత్తల నుండి నేర్చుకోవలసిన అంశాలు చాలా ఉన్నాయి. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం.
భవదీయుడు
డా।। వంగూరి చిట్టెన్‌రాజు
వ్యవస్థాపకులు, వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా