Navayugala bata Narla Mata - Narla Venkateswara Rao
Product details
కారణాలు ఏమైతే నేమి - ఈ మూడవ కూర్పు ప్రచురణలో అనవసర విలంబన జరిగింది. ఇందుకు చింతిస్తున్నాను.నా పరిపాటి ప్రకారం ఈ ముద్రణలో పాత పద్యాలను కొన్నింటిని యెత్తివేశాను; కొత్త వాటిని కొంచెం తక్కువగా నూరింటివరకు చేర్చాను. ఇంతేకాక, పాత పద్యాల పాదాలలో చిన్న, పెద్ద మార్పులను పెక్కింటిని చేశాను; కొన్ని పద్యాలను పూర్తిగా తిరగ వ్రాశాను. ఈ మార్పుల వల్ల, చేర్పుల వల్ల ఈ సంపుటి విలువ పెరిగిందో, లేదో నిర్ణయించవలసినవారు నా పాఠకులే.ఈనాడు నేను వ్రాసింది రేపటికే నాకు అసంతృప్తిని కలిగిస్తుంది. అందువల్ల నేను వ్రాసిన దానిలో కనీసం నూటికి ముప్పది వంతులనైనా పుస్తక రూపంలో ప్రచురించను. ప్రస్తుతం మనకు శతాధిక గ్రంథకర్తలు ఎందరో ఉన్నారు. వారికోవకు చెందగల శక్తి సామర్థ్యాలు నాకు లేవు. ఈ పద్యాల సంఖ్యను (నేను కోరుకొంటున్నట్టు) వెయ్యివరకు పెంచడమైనా నాకు సాధ్యం కాకపోవచ్చు.పోయిన పదేళ్ళలో నా మానవతావాదాన్ని పరీక్షకు పెట్టిన సన్నివేశాలకు లెక్కలేదు. అవి వ్యక్తిగతమైన సన్నివేశాలే కాదు, సంఘపరమైనవి కూడా. అవి నా మనస్సును కలత పరిచాయి; నా హృదయాన్ని గాయపరిచాయి; నా కళ్ళకు నిద్రను దూరం చేశాయి; నాలోని ప్రతి రక్తాణువులోను అగ్ని కీలలను రగిల్చాయి. అయినా మానవునిపట్ల, మానవతపట్ల నా ప్రేమ విశ్వాసాలను చెక్కుచెదరకుండా నేను నిలుపుకొనగలిగినట్టు ఈ సంపుటి నిరూపించగలదనే 'ఆశిస్తున్నాను.పోతే ఈ మూడవ కూర్పును ప్రచురించడంలో నాకు అన్ని విధాల ప్రోత్సాహాన్ని కూర్చిన నా కొత్త ప్రచురణకర్త శ్రీ ఎస్. గోపాలరావుగారికి, దీని ముద్రణలో ప్రత్యేక శ్రద్ధాసక్తులను చూపిన నాగార్జున ప్రింటింగ్ ప్రెస్ వారికి నా నమస్కారాలు.
“లుంబిని” - నార్ల వెంకటేశ్వరరావు
బంజారా హిల్స్,
హైదరాబాదు - 500 034