నేనూ-నా రచనలు - ‘కళాప్రపూర్ణ’ అవసరాల (వింజమూరి) అనసూయా దేవి
Product details
అనసూయగారితో నా మొదటి వ్యక్తిగత పరిచయం 1977లో న్యూయార్క్‌లో జరిగిన మొట్టమొదటి అమెరికా తెలుగు సమ్మేళనం (తానా)లో. ఆ సమ్మేళనం తరువాత తన అనుంగు సోదరి సీతగారితో అనసూయగారు హ్యూస్టన్ వచ్చినప్పుడు ఆ అపూర్వ సోదరీమణులచేత జానపద గేయాలు పాడించి, నాతో సహా స్థానిక గాయకులందరూ వంత పాడి, ‘‘మన పల్లె పదాలు’’ అనే గ్రామఫోన్ రికార్డు అమెరికాలో విడుదల చేశాం. ఆ రికార్డుకి నేను, అనసూయగారి పెద్దల్లుడు అనిల్ కుమార్ (సుప్రసిద్ధ నర్తకి రత్నపాప జీవిత భాగస్వామి) ప్రొడ్యూస్ చేశాం. అనసూయ - సీతగారల గానకచేరీలు అమెరికాలో చాలా చోట్ల ఏర్పాటు చేసే అవకాశం కూడా నాకు దక్కింది. హ్యూస్టన్లో సరే, స్వర్గీయ దువ్వూరి నారాయణరావుగారికి తోడూ నీడగా జానపద గేయాలు, భావ గీతాలు, దేశభక్తి గీతాలు, అష్టపదులు ఇలా ఒకటేమిటి అనేక రకాల తెలుగు సంగీత కార్యక్రమాలు ఏర్పాటు చేసిన అదృష్టం నాకు దక్కింది.
అంతటితో ఆగలేదు నా అదృష్టం. ఎంతో వైవిధ్యం ఉన్న ఈ పుస్తకాన్ని ప్రచురించి, తద్వారా తన 75 సంవత్సరాల తెలుగు సంగీత సేవని తెలుగు జాతి యావత్తూ సంస్మరించుకునే ఈ అవకాశాన్ని ‘వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా’కి ప్రసాదించిన ఆ మహోన్నత సంగీతమూర్తి ‘‘కళాప్రపూర్ణ’’ డా. అవసరాల (వింజమూరి) అనసూయా దేవిగారికి మా అభినందనలు, కృతజ్ఞతలు. తెలుగు సంగీత చరిత్రలో కొన్ని ప్రధాన ఘట్టాలని మళ్ళీ గుర్తు తెచ్చుకుందామనే ఆనాటి వారికి అపరిమితమైన ఆనందాన్నీ, ఆ చరిత్రని తెలుసుకుని భవిష్యత్తుని ఉదాత్తంగా తీర్చిదిద్దుకుందామనుకునే ఈ తరం సంగీత, సాహిత్య ప్రియులకి అసమాన ఉత్తేజాన్ని ఈ ‘‘చిన్న’’ పుస్తకం కలిగిస్తుందనే మా ప్రగాఢ విశ్వాసం.
చారిత్రాత్మక ప్రాముఖ్యత కలిగిన ఈ ప్రచురణని పాఠకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాను.
ఈ అసాధారణ పుస్తక ప్రచురణకి అసాధారణ సహకారం అందజేసిన ‘‘రచన’’ శాయిగారికి ధన్యవాదాలు చెప్పడం నాబోటి సాధారణ మానవమాత్రుడికి మాటలతో సాధ్యం కాదు. అందుకే ఒకే ఒక్క చిన్నమాట- Thank you Sai garu & Company.
భవదీయుడు,
వంగూరి చిట్టెన్ రాజు
For Audio link below
https://archive.org/details/nenu-na-rachanalu-avasarala-vinjamuri-anasuyadevi