Paripari Parichayalu
Product details
2004 వ సంవత్సరంలో నేను ఇండియా వెళ్ళినప్పుడు మిత్రులు,
శ్రీ ఎం.వి.యస్.శాస్త్రిగారు (ఆంధ్రభూమి సంపాదకులు), శ్రీకాంతశర్మగారు సాహిత్యపరమైన విషయాలు ముచ్చటిస్తునప్పుడు, శ్రీకాంతశర్మగారు ఆంధ్రభూమిలో అప్పుడు ధారావాహికంగా ప్రచురిస్తున్న “పరిపరి పరిచయాలు” నా దృష్టికి వచ్చింది. రాత్రికి రాత్రి ఆ వ్యాసాలన్నీ చదవగానే, నా ఒళ్ళు గగుర్పాటు చెందింది. శ్రీకాంతశర్మగారి స్వతస్సిద్ధమైన నిరాడంబరం, అద్భుతమైన విచక్షణాజ్ఞానం, సద్విమర్శనా పాటవం, జన్మతో సహా అబ్బిన పాండిత్యం, అవన్నీ అలవోకగా అందరితోటి పంచుకునే చాతుర్యం అబ్బడానికి ఆయన జీవితంలో ఆఖండ ప్రజ్ఞావంతుల సాంగత్య బలం ఒక కారణం అని అనిపించింది. ఆ వ్యాసాలన్నింటినీ ఒక సంపుటిగా వేద్దామనే ఆనాటి సంకల్పం ఈనాటికి నెరవేరింది. తెలుగు నాట గత ఐదారు దశాబ్దాలగా మన సాహిత్యాన్నీ, సృజనాత్మకతనీ ఉన్నత స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరితోటీ “పరిపరి” విధాలుగా పరిచయం ఉండి, వారిని తన వ్యక్తిగత అనుభవాలతో క్రోడీకరించిన ఈ అపురూపమైన వ్యాససంపుటని పుస్తక రూపంలో వెలువరించడానికి మాకు అనుమతి ఇచ్చిన శ్రీకాంతశర్మ గారికీ, వ్యక్తిగతంగానూ, వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా తరపునా మా కృతజ్ఞతలు తెలియచేసుకుంటుంన్నాం. తెలుగు పాఠకలోకం ఈ అపురూపమైన గ్రంథాన్ని ఆదరిస్తారని ఆశిస్తున్నాం.
హ్యూస్టన్, టెక్సస్. .... వంగూరి చిట్టెన్ రాజు
ఫిబ్రవరి1, 2009