మనిషిని సరైన మార్గంలో నడిపించడానికి చెప్పే మంచి మాటలు సర్వే సర్వత్రా ఆచరణీయాలు. అవి ఏ భాషా సాహిత్యంలోవున్నా ఎవరు చెప్పినా తెలుసుకోదగినవే. ఈనాడు ఆంగ్ల భాష ప్రపంచంలోని అన్ని భాషల్లోకి అత్యున్నతమైన స్థితిలో వుందన్నది ఎవరూ కాదనలేని సత్యం. ఆణిముత్యాలనదగిన రచనలెన్నో ఆ భాషలో ఎందరో మహానుభావులు రచించారు. అవన్నీ విస్తృతిలో, వైవిధ్యంలో జనబాహుళ్యానికి ఎంతో ఉపయోగపడే రీతిలో ఉన్నాయి. “వినదగు నెవ్వరు చెప్పిన” అన్నట్లు, సార్వజనీనంగా వుండే సూక్తులు ఏ ఒక్క భాషకో పరిమితం కాకూడదు. సాధ్యమైనంత వరకు అందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి చేస్తున్న వినూత్న ప్రయోగమే, బహుజనాదరణ పొందిన ఆకాశవాణి వారి 'సూక్తిసుధ' ప్రచురణ.