SANGAVIDHA - Dr. P.V. ARUNACHALAM
Product details
జన జీవితంలో ప్రజలు అనేక సమస్యలను ఎదుర్కొన్నట్లే గణితశాస్త్రజ్ఞులు కూడ వాటిని ఎదుర్కొని, అధిగమించి క్లిష్ట పరిస్థితులలోను తమ శాస్త్ర ఆవిష్కరణలకు ఎనలేని సేవచేసియున్నారు. ఇవి దేశకాలాతీతమైనవి. వీరిలో ఎందరో విషాద జీవితమును చవిచూచినవారు, అల్పాయుషులు, విధివంచితులున్నారు. ఈ మేధావుల జీవితములను తలచుకొన్నచో కన్నులు చమర్చక మానవు. కొందరు గణిత శాస్త్రజ్ఞులు అప్పటి రాజకీయ, సాంఘిక పరిస్థితులు ప్రతికూలముగానున్నను, దానికి వెరవక వారి ఆవిష్కరణలనుబహిర్గత మొనర్చినారు. వీరిని గూర్చి ఒక ప్రత్యేక గ్రంథమే వ్రాయవలసిన అవసరమున్నది.
గణితమున లోతైన అవగాహన, పరిశోధన, ఆవిష్కృతులు, గణిత ప్రౌఢిమ శుభలక్షణములని రచయిత నుడివియున్నారు.
వీరు విద్యార్థిగా నున్నప్పుడే పద్యరచన, ఆశుకవిత్వము అలవరచుకొన్నారు. వీరు ఉద్యోగ జీవితమును ఉపన్యాసకులుగా ప్రారంభించి క్రమ క్రమముగా వివిధ పదవులను అలంకరించి ద్రవిడియన్ విశ్వవిద్యాలయ ఉపకులపతిగా పదేళ్లు పదవి నలంకరించి విరమణ చేసి పిదప తిరుపతిలో ప్రస్తుతము ప్రశాంత నిరాడంబర జీవితమును గడుపుచున్నారు. ఆబాల గోపాలమునకు అందుబాటులో నుండి వారి సందేహముల నివర్తి చేయుచున్నారు. విద్యార్థుల స్థాయిని బట్టి వారికి సుబోధమగునట్లు వారి సందేహములను తీర్చుట వీరికి వెన్నతో పెట్టిన విద్య.ఉన్నత పాఠశాల నుంచి సర్వకళాశాల సమావేశ ఆహ్వానములను మన్నించి వారికి తగిన రీతిని సూచనలను సలహాల నిచ్చి ప్రోత్సహించేవారు.
వీరి జీవిత ప్రగతికి ముఖ్య ఆలంబనమైన గణితశాస్త్రమునకు ఈ అరుదైన గ్రంథమును కానుకగా సమర్పించి కొంతమేర తన ఋణమును తీర్చుకొన్నారు. ఇది వీరి విశిష్టత. వీరి జీవితముతో సన్నిహిత సాన్నిధ్యమున్న వారికి వీరికి ఒక కన్ను గణిత శాస్త్రమైనచో మరియొక కన్ను ఆంధ్ర సాహిత్యమని సులభముగ తెలియగలదు.
వీరికి విశ్వేశ్వరుడు ఆయురారోగ్య ఐశ్వర్యములిచ్చి, ఇటు వంటి మరెన్నో గ్రంథ రచనలకు కావలసిన జవసత్వాలు, మనో బలాలను అనుగ్రహించవలెనని మనసారా వేడుకొనుచున్నాను.
శుభమస్తు!
సీకాయపట్టెడ కె. సుదర్శన,
కె.ఆర్. నాగరాజన్, ఎం.ఎ., ఎం.ఇడి