స్వాతంత్య్ర సమరంలో ఆంధ్ర మహిళలు
Product details
ఆంధ్రదేశంలో సంఘ సేవాధురీణులు, బహుముఖ ప్రజ్ఞాశాలురయిన సుహిళలకు కొదువలేదు. ఆకోవలోని త్యాగమూర్తుల జీవితాలలోని ఆసక్తి దాయకమయిన ప్రధాన ఘట్టాలను మననం చేసుకొంటున్నప్పుడు కలిగే అనుభూతి అనుభవైక వేద్యం, అటువంటి ఆనందాన్ని అందరికీ అందివ్వాలనే ప్రయత్నమే ‘‘స్వాతంత్ర్య సమరంలో ఆంధ్రమహిళలు’’ అనే ఈ గ్రంథం, ఇందులో అరవయ్యెనిమిది మంది తెలుగు మహిళల జీవిత చరిత్రలు, అందలి ముఖ్యమయిన ఘట్టాలు సంగ్రహంగా సరళమైన భాషలో, రసవత్తరంగా వివరించ బడినవి. ఒక్కొక్క స్త్రీమూర్తిని గురించిన జీవిత విశేషాలు ఒక కథగా సాగుతుంది.
సరోజినీ నాయుడు, దుర్గాబాయి దేశముఖ్ వంటి బహుముఖ ప్రజ్ఞాశీలురతోపాటు తెలుగింటిని మెట్టి, సాంఘిక చైతన్యంలో ఘనకీర్తిని గుర్తించిన పాశ్చాత్య వనితలు శ్రీమతి ఉప్పల మెల్లి షోలింగరు లక్ష్మణరావు, శ్రీమతి ఎలెన్ శర్మ కూడ ఈ గ్రంథంలో చోటు చేసుకోవడం ముదావహం, హర్షనీయం. ఇందులో కేవలం ఆయా మహిళల జీవితాలలోని ముఖ్యమైన ఘట్టాలేగాక, భారత స్వాతంత్య్ర సమరంలోని ప్రధాన ఘట్టాలు, అందులో పాల్గొనిన తెలుగు మహిళలు నిర్వహించిన వివిధ కార్యక్రమాలు, సాహసకృత్యములు, త్యాగనిరతి, గాధలుగా వివరింపబడి రసహృదయాలను స్పందింపజేస్తాయి.
ఇటువంటి గ్రంథాలు తెలుగు సాహిత్యంలో చాల అరుదుగావచ్చినవి. ఆంధ్ర మహిళాభ్యుదయానికి అవిరళ కృషి సల్పిన తెలుగింటి ఆడపడుచులలో ఆణిముత్యాలవంటి కొందరి జీవిత వివరాలను సంకలనంచేసి పుస్తక రూపంలో వెలువరించుటలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురావస్తు ప్రదర్శనశాలల శాఖవారు చేసిన కృషి శ్లాఘనీయము.
డా. అల్లాడి పి. రాజ్ కుమార్
వెనుకబడిన తరగతుల సంక్షేమం, పర్యటన,
అభిలేఖ, పురావస్తు శాఖమంత్రి,
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము.