Product details
ఆశీస్సు
‘పుస్తకం దేనికి?’
‘చదవడం కోసం’
ఈ ప్రశ్నోత్తరాలు పరమానందయ్యగారి శిష్యునికీ, ఆ గురూత్తమునికే చెల్లునని నవ్వి వేయడానికి ముందు కడకంటా చదవలేక ఏ కొద్ది పుటల తరవాతనో మీరు ఒక పక్కకు నెట్టిన పుస్తకాలెన్నో జ్ఞాపకం తెచ్చుకోడానికి ప్రయత్నించండి. ‘చదవడంకోసమే పుస్తకం’ అనే విషయాన్నే ప్రతి రచయిత గుర్తిస్తే, “చదివించగల” ప్రజ్ఞ లేనివారు పుస్తకాలను వ్రాయటం విరమిస్తే, చిత్తుకాగితాల మార్కెట్టుకు సరుకు అందడం కష్టమైపోతుంది.
రచయితకు కావలసిన ఈ ప్రథమ యోగ్యత –“చదివించగలగడం”- నా మిత్రులు, ఒకప్పుడు- నా సహాయ సంపాదకులు శ్రీ ముద్దా విశ్వనాథంగారికి వలె ఆయన కుమారుడు చిరంజీవి ఎమ్. ఎస్. శాస్త్రికి కూడా విశేషంగా వున్నది.
శాస్త్రి రచనలలో ఇది – “సాహిత్యంలో జంతు జాలం”- మూడవది. ఈమూడింటిలో దేన్నీ- ముఖ్యంగా ఈ మూడవదాన్ని- చదవడం ప్రారంభిస్తే ముగించకుండా విడిచిపెట్టలేము. ఇంతే కాదు- ఎక్కడైనా మొదలు పెట్టి, ఎంత వరకైనా వీటిని చదవవచ్చు. శాస్త్రి రచనా పటిమకు ఇది తిరుగులేని తార్కాణం.
మిత్రుని కుమారుడని శాస్త్రికి నేను ఇంత పెద్ద కితాబులివ్వడంలేదు. ఏవో కొత్త విషయాలను గురించి వ్రాస్తూ చదువరికి ఆసక్తి కలిగించడం ఒక విశేషం కాదు. అందరికీ తెలిసిన పాత విషయాలను గురించి వ్రాస్తూ కూడా ఆసక్తితో చదివించగలిగినప్పుడే రచయిత పస బయటపడుతుంది. శాస్త్రి తన రచనలలో ఏరి కూర్చుకొన్నవన్నీ కుక్క- నక్క, గుర్రం గాడిద, ఆవు- ఎద్దు మొదలైన సామాన్య జంతువులను గురించి. అయినా, పాఠకుల దృష్టిని శాస్త్రి ఎంతగానో ఆకర్షించగలుగుతున్నాడంటే, వారిని అలరించ గలుగుతున్నాడంటే- నేనే గాక ఎవరైనా సరే రచయితగా అతనిని మెచ్చుకొనక తప్పదు.
అందరికి తెలిసిన విషయాలనే శాస్త్రి ఏరి కూర్చుకొన్నాడని ఇంతకు ముందు నేనన్నప్పటికీ, మన సాహిత్యంతో, మన సంస్కృతితో, మన జాతీయ జీవితంతో సన్నిహిత సంబంధం కలవారికి మాత్రమే తప్ప అతను వ్రాసే విషయాలన్నీ పూర్తిగా తెలియవు. ఇంత చిన్న వయస్సులోనే ఇంత విషయ పరిజ్ఞానాన్ని శాస్త్రి గడించబట్టే రచయితగా అతనికి గొప్ప భవిష్యత్తు కలదని అనుకోవచ్చు. ఇప్పటికి ఈ మూడు పుస్తకాలతోనైనా శాస్త్రి సాధించిన విజయం సామాన్యమైంది కాదు. అతనికి నా ఆశీస్సులు.
“ఆంధ్రప్రభ”
మద్రాసు
22-4-54
ముందుమాట
ఈ పుస్తకం 70 ఏళ్ళ కంటే ముందరిది. నార్ల సమగ్ర సాహిత్యాన్ని అక్షరం కూడా మార్చకుండా నవీకరించే భాగ్యం 2024లో .... పేజీలతో మా బృందానికీ కలిగిన గొప్ప అదృష్టం. తరువాత నార్ల వారి ఆశీస్సు అందుకున్నది ఈ పుస్తకం. ‘మనసు ఫౌండేషన్’ వారిచే పదిలంగా పరిరక్షించబడినది మాకు లభించింది. మా కర్తవ్యం నెరవేర్చాము. రంగుల బొమ్మలతో అందరికీ నచ్చేలాగా, అందుబాటులోకి తీసుకువచ్చాము. ఆస్వాదించి ఆశీస్సులు అందిస్తారని ఆశ, ఆకాంక్ష.
నార్ల వారి మాట పద్యం
మొగ్గ, పూవు, పిందె పుట్లుపుట్లుగ రాల్చ
గట్టి కాయ మిగులు చెట్టునందు :
ఎంతొ వ్రాసినపుడె కొంతేదో మిగులురా!
అన్య భాషపైని అధికార మబ్బదు
అంతు పట్టదేని సొంతభాష:
మొదలు నేర్వకున్న తుద నెట్టు నేర్చురా ?
నవీకరణ : నవంబరు 2025
94410 65414
పెద్ది సాంబశివరావు, యం.ఏ.
షేక్. కమాలి, యం.యస్సీ
గాలం రమేష్, బి.యస్సీ
యల్లావుల భవాని, బి.కాం
దూసరి సుజిత, బి.టెక్.
https://peddisambasivarao.in/
https://books.peddisambasivarao.in/
Similar products